గంగావతరణం | సిరివెన్నెల సీతారామ శాస్త్రి  | రసవాహినీ స్వాగతం

 


నాకలోకమది నీ... పుట్టిన ఇల్లు
నాగభూషణుడు చేపట్టినవాడు


లోకపావనీ... మందాకినీ

రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం
రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం
సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే
రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం

ఆఘమీభువి నిదాఘమై... అర్కద్యుతి ఆమోఘమై(2)
సకలజగతి దాహతప్త సంక్షోభితమైననాడు
దివివారిని భువిసీమకు తరలించగ దలచినట్టి
భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు
భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు
విరూపాక్ష కరుణా సంప్రోక్షణమీ రసవాహిని
జీవరసధునీ స్వాగతం... రసవాహినీ స్వాగతం

నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా
యుగయుగాల నిరీక్షణే నివాళికాగా
నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా
యుగయుగాల నిరీక్షణే నివాళికాగా
ప్రాంజలి ఘటియించి తనదు, ప్రాంగణమున నిలిచినట్టి
పిపాసార్త జగతికొరకు నిఠలాక్షు ఝటాఝుటి వియద్వాటి వీచెనది
నిఠలాక్షు ఝటాఝుటి వియద్వాటి వీచెనదీ

గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది
గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది
నింగినితాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాస లాస్యము.
ప్రళయాభీల తరంగితలీల భయంకరహేళ శివంకరుమ్రోల
లయించగచేరగ అలలై కలలై వడిగా జడిగా
పిడుగుల అడుగులు తడబడు నడకల
ఝలంఝళిత పద నూపురఘోషల
కలితనాట్య ఘటిత చకిచ్చకిత తటిల్లతా తరూలతిక ద్యుతి
సురఝరి ఝఝరీనాద సందోహిత దివి వధూటి వచ్చెనదీ
నిఠలాక్షు ఝటాఝుటి వియద్వాటి వేచెనదీ
సురఝరి జఝరీనాద సందోహిత దివి వధూటి వచ్చెనదీ

పినాకపాణీ వేణీభరమే కరమై గ్రహించె సురగంగను తన నాయికగా
ఉరుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా
ఆ సురగంగా ప్రళయహేళ అది విషకంధరునకు ప్రణయలీలగా
విలయమ్మును తన విలాసమ్ముగా ఔదలదాల్చెను శంకరుడాభరణముగా,
మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా .. నెలవంకమీదుగా.
చిరునవ్వుల కిరణమ్ముల జీవజ్యోత్స్న వర్షించెను... రసవాహిని ప్రభవించెను.
శివగంగా కళ్యాణం... అది దివిభువి సంధానం
పిపాసులకు రసగానం, ఈ స్వాగత గానం
ఇది స్వాగతగానం

సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే
రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం
జీవనరసధునీ నీకు స్వాగతం

Comments

Popular posts from this blog

పాడుదాం భారత గీతి

రాగమయీ రావే - జయభేరి - పెండ్యాల నాగేశ్వర రావు - మల్లాది రామకృష్ణ శాస్త్రి - ఘంటసాల

Podcast on Chakravarthy - Draft Script